పీఠిక

కాలాయ తస్మై నమః

అనంతమైన కాలప్రవాహంలో పయనిస్తున్న మానవులు తమ వ్యవహార సౌకర్యానికి ఏర్పాటు చేసుకున్న వ్యవస్థలలో కాలగణనం అతి ముఖ్యమైనది. వాస్తవంగా చెప్పాలంటే, ఆద్యంతములు లేని పరమాత్మ లక్షణమైన ఈ కాలమును లెక్కించడం అసాధ్యమే. అయినప్పటికీ కళ్ళకు కనబడుతున్న సూర్యచంద్రాది గ్రహగోళములను పరిశీలిస్తూ, వాటి ఆధారంగా ఇటువంటి వ్యవస్థను ఏర్పరచుకున్నారు. భారతీయుల కాలగణనానికి వేద, పురాణ వాఙ్మయమే ఆధారం

ఈ కాలగణనంలో బ్రహ్మదేవుడి పదవీకాలము అతి పెద్ద మానకము(యూనిట్) కాగా, క్షణకాలము (అతిచిన్నది). దైనందిన వ్యవహారాలకు ఉపకరించేట్లుగా క్షణములు, నిమిషాలు, గంటలు లేక (ఘడియలు, విఘడియలు), లగ్నములు, యామములు (ఝాములు), పగలు, రాత్రి, దినములనే సామాన్య విభాగములు ఏర్పడినాయి. ఒక పగలు, ఒక రాత్రి కలిస్తే ఒక దినము అని లెక్కించి, దీనికి సరిపోయేట్లుగాతిథి, వారము, నక్షత్రము, యోగము మరియు కరణము అనే మానకాలను సూర్య, చంద్ర, భూమి గతులను ఆధారంగా చేసుకుని ఋషి సంప్రదాయం మనకు బోధిస్తున్నది. రోజువారీ కాలమును లెక్కించేందుకు, అతిముఖ్యమైన అంశములు ఈ ఐదనీ, వీటి సమూహమును పంచాంగము అంటారని కూడ తెలుసుకోవాలి.

భారతీయులకు తరతరాలగా సంక్రమిస్తున్న ఈ అపూర్వ సంప్రదాయాన్ని  పరిరక్షిస్తున్న ధార్మిక వ్యవస్థకు ప్రస్తుతకాలంలో దేవాలయాలు, వేదపాఠశాలలూ, విద్వాంసుల బృందములు, మఠములు, పీఠములు ఆలవాలంగా నెలకొన్నాయి.

        ఆయా ప్రాంతాలలోని భక్తులకు,శిష్యులకు అనువుగా ఉండేందుకూ, మరియూ వారి వారి సంప్రదాయాలలోని ముఖ్యమైన పండుగలను పర్వదినాలను గుర్తు చేసేందుకై, ప్రత్యేక పంచాంగాలను ముద్రించడం కూడ ఆనవాయితీగా ఉన్నది.

అవధూత దత్తపీఠంలో నిర్వహించే పర్వదినాలతో పాటుగా, ప్రతి దినము గ్రహస్థితులను గుర్తించి లగ్నముల ప్రాబల్య దౌర్బల్యమును పరిశీలించేందుకు రాశిచక్రములను, ధార్మిక జీవనస్రవంతిలోని ప్రముఖమైన పండుగలనూ భక్తులకు సులభంగా అందించేందుకై జగద్గురుపరమపూజ్య శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి దివ్యాశీస్సులతో ఈ పంచాంగము ముద్రించబడినది.

     సూర్యసిద్ధాంతమును అనుసరించి, చంద్రగతిపై ప్రధానంగా ఆధారపడిన ఈ చాంద్రమాన పంచాంగములోని సమయాలన్నీ భారతీయ కాలమానము (I.S.Tలేక ఇండియన్ స్టాండర్డ్ టైమ్) పై ఆధారపడి ఉన్నాయి.

గంగానదీ తీరంలో 82.5 రేఖాంశము పైన వింధ్యవాసిని క్షేత్రమునకు (మీర్జాపూర్) సరిపడేట్లుగా ఉన్న భారతీయ కాలమానానికి, స్థానిక కాలానికి ఉన్న భేదమును పాఠకులు గుర్తించాలి. భారతీయ కాలమాన రేఖాంశకు పశ్చిమంగా ఉన్నవారు, అన్ని నిమిషాలను పంచాంగ సమయానికి కలుపుకోవాలి.అలాగే రేఖాంశానికి తూర్పుగా ఉన్నవారు అన్ని నిమిషాలు తీసివేయాలి.

ఆధునిక వైజ్ఞానిక పరికరాల సహాయంతో దేశాంతర సంస్కారము చేసేందుకై ఈ పట్టిక ముద్రించబడినది. (ఉదాహరణకు - దశమి 10గంటల 20 నిముషాల వరకు అంటే, మైసూరు ప్రాంతం వారు 25 నిమిషాలు కలుపుకోవాలి. అలాగే విశాఖపట్టణమువారు 2 నిమిషాలు తీసివేయాలి).

అయితే, సూర్యోదయ సూర్యాస్తమయాలు లగ్నాంతకాలాలు మటుకు మైసూరు నగరానికి సరిపోయేట్లుగా మార్చబడినాయి. కాబట్టి, సూర్యోదయ సూర్యాస్తమానాలను ఏ ఊరిలో ఉండేవారు అక్కడి దేశకాలాలను అనుసరించాలి.

          తిథి, వార, నక్షత్ర, యోగ కరణములకు, సూచించిన సమయాలు సమాప్తి సమయానికి సంకేతములు. రాహుకాలము సాధారణంగా ఈ పంచాంగముతో పాటుగా, అన్ని పంచాంగాలలో సూచించే రాహుకాలము, పగలు, రాత్రి సమానంగా ఉన్న కొద్ది రోజులకు మాత్రమే వర్తిస్తుంది.

ప్రతిదినము సూర్యోదయ సూర్యాస్తమానముయొక్క మధ్య సమయాన్ని 7 భాగములు చేసుకుంటేనే, ఆనాటి రాహుకాలం తెలుస్తుంది.ఈ పంచాంగములో సంవత్సర ఫలితాలతో పాటుగా, నిత్యం అవసరమయ్యే ధర్మశాస్త్ర విషయాలు, జ్యౌతిష అంశాలు యథోచితంగా చేర్చబడ్డాయి.

తరతరాలుగా పంచాంగ గణితం ద్వారా ప్రజా సేవ చేస్తున్నరేలంగి గ్రామం తంగిరాల వంశజుడైన బ్రహ్మ శ్రీకృష్ణపూర్ణ ప్రసాద సిద్ధాంతి గారు, శ్రీ వేంకటేశ్వర స్వామివారి తిరుమల క్షేత్రానికి పంచాంగగణన సేవను అందిస్తూ, దానితోపాటుగా దత్త స్వామి నెలకొన్న అవధూత దత్తపీఠానికి కూడా సేవ చేసే మహాభాగ్యానికి నోచుకున్న మహనీయుడు.

వీరి గణితంతో పాటుగా, పంచాంగ విషయములను ధార్మికులకు సులభంగా అందించేందుకు శ్రీ గణపతి సచ్చిదానంద వేదనిధి అకాడెమీ బృందంవారు, పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ దత్తవిజయానంద తీర్థ స్వామి (బాలస్వామి) వారి ప్రోత్సాహముతో చక్కగా కృషి చేశారు. అనతి కాలంలో సుందరంగా ముద్రించిన ఘనత బెంగళూరులోని మా ప్రింట్స్ వారికి అందినది.

ఈ పంచాంగమును భక్తులకు అందించడంలో మంచి సేవ చేసిన వీరందరితో పాటుగా, పంచాంగవిషయములను పఠించి, ధార్మిక కర్మాచరణ చేసే సద్భక్తులందరికీ శ్రీ దత్తాత్రేయస్వామి వారి అనుగ్రహముతో పాటుగా సద్గురువులైన శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి ఆశీస్సులు పుష్కలంగా లభించాలని ప్రార్థిస్తున్నాము.

                ఫాల్గున కృష్ణ ఏకాదశి                                           దత్తపీఠ కార్యవర్గ పక్షాన

                 4-4-2016                                                     Dr.వంశీకృష్ణ ఘనపాఠీ

ఈ ప్రచురణకు సేవ చేసిన సభ్యులు

 1)      కడియాల సూర్యనారాయణ

2)      కడియాల సుమిత్రా గాయత్రి

3)      ద్విభాష్యం హనుమత్ ప్రసన్న

4)      ద్విభాష్యం మనోజ

5)      నారాయణ హెగ్డే

6)      ఆకెళ్ళ దత్త

7)      బులుసు తేజ

8)      ఈమని ఆదిత్య

9)      మూగుల ప్రసాద్

10)    బాబు మా ప్రింట్స్

11)    చైతన్య కుమార్ కోహిర్

12)    యద్దనపూడి శివ సుబ్రహ్మణ్యం