పంచాంగ పఠన రీతిః

అనాదిగా, అనంతముగా ఉన్న కాలమును గణన చేయడం సంపూర్ణంగా సాధ్యం కానప్పటికీ, సూర్యచంద్రుల గతిని, సృష్టికర్త, మరియు మనువు యొక్క పదవీకాలాలను బట్టి, మహర్షులు కాల గణనకై వ్యవస్థ చేశారు. వీటిలో దినవారీ ముఖ్యమైన అంగాలు ఐదు. వీటినే పంచాంగములు అంటారు. 1. తిథి 2. వారం 3. నక్షత్రం 4. యోగం 5. కరణం. ఐదు అంగములను కలిగిన కాలాన్ని (పంచాంగ స్వరూపంగా) సర్వకర్మలలోనూ స్మరించడం మన ఆచారం. సూర్య చంద్ర గతులను బట్టి, ఇవి రోజూ మారుతూ ఉంటాయి. భారత దేశపు దక్షిణ, పూర్వ భాగాలలో చాంద్రమానం (చంద్రుడి గతిని బట్టి సంవత్సరములను గణించుట), సౌర మానం (సూర్యుడి గతిని బట్టి సంవత్సరములను గణించుట) ముఖ్యంగా ఆచరణలో ఉన్నాయి. ఉత్తర, పశ్చిమ భాగాలలో బార్హస్పత్య మానం (బృహస్పతి గ్రహ సంచారాన్ని బట్టి సంవత్సరములను గణించుట) ఆచరణలో ఉన్నది. ఏది ఏమైనా, అందరూ సంధ్యావందనాదులకు, చంద్రుడి గతిని బట్టి తిథిని చెప్పవలసినదే. మరియు పూర్ణిమ, అమావాస్యలను, పర్వదినాలను నిర్ణయించేందుకు చాంద్రమానమునే అనుసరించాలి.