పంచాంగాలు

పంచాంగాలు
          తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు పంచాంగాలని తెలుసుకున్నాం. ఇవి సూర్య. చంద్ర గతులపైనే ఆధారపడి ఉంటాయని కూడ తెలుసుకున్నాం.

          వీటిలో వారానికీ సూర్యుడి గతికీ సంబంధమున్నది. అందుకే సూర్యడివలె వారం కూడ స్థిరంగా ఉంటుంది. వారం అంటే, మళ్ళీ మళ్లీ అని అర్థం. దీనికి వాస్తవానికి వాసర అని పేరు. ఒక పగలు, రాత్రి కలిపి ఒక వాసరమవుతుంది. అయితే, వ్యవహారంలో మాత్రం ప్రధానంగా పగటిని వాసరమని పిలుస్తారు. (ప్రస్తుతకాలంలో కూడ day అని పిలిచినపుడు పగటికీ, రోజంతటికీ కూడ సంకేతమే. సందర్భాన్ని బట్టి అర్థం చేసుకుంటాం.)  
వారాలు ఏడు. ఇవి 7 గ్రహాల పేర్లతో ప్రసిద్ధమైనాయి. పాశ్చాత్యులుకూడ ఇదే విధానాన్ని అనుసరిస్తున్నారు.

 
భాన్విందు భౌమ సౌమ్యాశ్చ బృహస్పతి భృగు స్థిరాః వాసరా స్సప్త లోకే హి ప్రసిద్ధా స్సర్వకర్మసు।। 
1.
ఆదివారము (భానువాసరః) 2. సోమ వారం (ఇందు వాసరః) 3. మంగళ వారం (భౌమ వాసరః) 4. బుధ వారం (సౌమ్య వాసరః) 5. గురువారం (బృహస్పతి వాసరః) 6. శుక్రవారం (భృగువాసరః) 7. శనివారం (స్థిర వాసరః).


తిథులు పదిహేను

          వారముతప్ప, మిగిలినవి నాలుగు అంగాలు ప్రధానంగా చంద్రుడి గతిపైన ఆధారపడి ఉన్నాయి. వాటిలో అత్యంత ముఖ్యమైనది తిథి. చంద్రుడు పూర్ణముగా కనిపిస్తే పూర్ణిమ. చంద్రుడు కనబడని రోజు అమావాస్య. (సూర్యుడితో పాటుగా చంద్రుడు కలిసి ఉంటాడు కాబట్టి అమావాస్య అనే పేరు వచ్చింది).

          ప్రతిపచ్చ ద్వితీయా వై తృతీయా చ చతుర్థికా
                   పంచమీ చ తథా షష్ఠీ సప్తమీ చాష్టమీ తిథిః।।
నవమీ దశమీ చైకా దశీ చ ద్వాదశీ తిథిః
         త్రయోదశీ చైవ చతుర్దశీ స్యాత్ ప్రతి పక్షకే।।
అమావాస్యా పౌర్ణమాసీ పర్వణీ కథితే ఉభే
         ఏతాః పఞ్చదశ ప్రోక్తాః తిథయో మునిభి శ్శుభాః।। 

         పూర్ణిమకూ, అమావాస్యకు మధ్య ఉండే 14 రోజులను ప్రతిపత్ (పాడ్యమి), ద్వితీయా, తృతీయా, చతుర్థీ, పంచమీ, షష్ఠీ, సప్తమీ, అష్టమీ, నవమీ, దశమీ, ఏకాదశీ, ద్వాదశీ, త్రయోదశీ, చతుర్దశీ అనే పేర్లతో పిలుస్తారు.       
          వీటిలో చతుర్థీ, షష్ఠీ, అష్టమీ, ద్వాదశీ, చతుర్దశీ పక్షచ్ఛిద్ర తిథులని పేరు. చతుర్థీ, నవమీ, చతుర్దశీ  - వీటిని రిక్తతిథులని అంటారు. వీటిలో శుభకార్యాలు చేయకపోవడం మంచిది.
మరియు నంద తిథులు, భద్ర తిథులు, జయ తిథులు ప్రశస్తమైనవి. సాధారణంగా విదియ, తదియ, పంచమీ, సప్తమీ, దశమీ, ఏకాదశీ ఉత్తమమైన తిథులు.


నక్షత్రాలు 27

        ఆకాశంలో చంద్రుడి గతిని పరిశీలిస్తే, నెల మొత్తంమీద ఒక్కో నక్షత్ర మండలముతో పాటుగా సంచరిస్తున్నట్లు గోచరిస్తున్నది. దీనినే పురాణ గాథలో అందంగా, ఆ నక్షత్రదేవతలు చంద్రుడి భార్యలు అని వివరించారు. వాస్తవానికి ఈ పేర్లతో ఉన్నది ఒక నక్షత్రగోళం కాదు. కొన్ని నక్షత్ర తేజః పుంజాల సమూహం. అందువల్లే వేదంలో కొన్ని చోట్ల ద్వివచనం, మరికొన్నిచోట్ల బహువచనాలను, కొన్ని చోట్ల ఏకవచనాలను ప్రయోగించారు. 


ఈ నక్షత్ర మండలాల గురించిన విస్తారమైన ప్రస్తావన వేదమంత్రాలలో ఉన్నది. జ్యోతిస్సు అంటే నక్షత్రము. దీనికి సంబంధించిన విషయము కాబట్టే జ్యోతిష్యము అనే పేరు కూడ వచ్చినది. కాబట్టి, కష్టాలలో ఉండేవారు, నక్షత్రాలను, వాటి అధిదేవతలనూ స్మరించేందుకై నక్షత్ర జపం అనే సంప్రదాయం కూడ ప్రసిద్ధమైనది.


నక్షత్రాణ్యథ వక్ష్యన్తే వేదోక్త క్రమ నామతః
                   కృత్తికా రోహిణీ చైవ మృగశీర్ష స్తథా ర్ద్రకా।।
          పునర్వసూ తిష్య ఏవ తథాశ్రేషా మఘాః క్రమాత్
                  పూర్వోత్తరే చ ఫల్గున్యౌ చ హస్త శ్చిత్రోపి తారకాః।।
          నిష్ట్యా విశాఖే సంఖ్యాతే అనూరాధా హి జ్యేష్ఠకా
                   మూలః పూర్వోత్తరాషాఢా అభిజిచ్చ విశేషభం।।
          శ్రోణా శ్రవిష్ఠా శ్చ శత భిషగ్వేదే తు చోదితః 
                   పూర్వోత్తరాః ప్రోష్ఠపదాః రేవత్యశ్వయుజౌ తతః।।  
         ఉత్తమా తారకోక్తాప భరణ్యో భాని ఖే క్రమాత్
                   అశ్విన్యాదీని వేదాంగే నక్షత్రాణి స్మృతాని వై।। 


        వేదములో, కృత్తికతో ప్రారంభించి ఈ నక్షత్రముల వరుస క్రమాన్ని చెప్పారు. కానీ, లోకంలో సాధారణంగా జ్యోతిష్కులంతా అశ్వినీ నక్షత్రముతో గణన ప్రారంభిస్తారు.  అభిజిత్ అనే నక్షత్రం ఉత్తరాషాఢ, శ్రవణ నక్షత్రాల మధ్యనున్నది. అక్కడక్కడా, దీనిని పరిగణిస్తారు.

          ఈ నక్షత్రాలలో కొన్నిటిని పుంలింగములోనూ, మరికొన్నిటిని స్త్రీలింగములోనూ బోధించారు. (నక్షత్రదేవతలకు స్వేచ్ఛ ప్రకారంగా తమ లింగాన్నీ, రూపాన్నీ మార్చుకునే శక్తిని పరమేశ్వరుడు ప్రసాదించాడని పురాణ గాథ)


          1. (అశ్వినీ) అశ్వయుఙ్నక్షత్రం 2. (అప) భరణీ నక్షత్రం 3. కృత్తికా నక్షత్రం 4. రోహిణీ నక్షత్రం 5. మృగశీర్ష నక్షత్రం 6. ఆర్ద్రా నక్షత్రం 7. పునర్వసు నక్షత్రం 8. తిష్య నక్షత్రం 9. ఆశ్రేషా నక్షత్రం 10. మఘా నక్షత్రం 11. పూర్వ ఫల్గునీ నక్షత్రం 12. ఉత్తర ఫల్గునీ నక్షత్రం 13. హస్త నక్షతం 14. చిత్రా నక్షత్రం 15. (స్వాతీ) నిష్ట్యా నక్షత్రం 16. విశాఖా నక్షత్రం 17. అనూరాధ నక్షత్రం 18. జ్యేష్ఠా నక్షత్రం 19. మూల నక్షత్రం 20. పూర్వాషాఢా నక్షత్రం 21. ఉత్తరాషాఢా నక్షత్రం (21 అభిజిత్ నక్షత్రం) 22. (శ్రవణ) శ్రోణా నక్షత్రం 23. (ధనిష్ఠ) శ్రవిష్ఠా నక్షత్రం 24. శతభిషఙ్నక్షత్రం 25. (పూర్వాభాద్ర) పూర్వప్రోష్ఠపద నక్షత్రం 26. (ఉత్తరాభాద్ర) ఉత్తర ప్రోష్ఠపద నక్షత్రం 27. రేవతీ నక్షత్రం

 

యోగములు ఇరవై ఏడు. ఇవి సూర్యచంద్ర గతుల సమన్వయాన్ని సూచిస్తాయి. ఆయా యోగాన్ని బట్టి, ఆనాటి ఫలితాన్ని కొంతవరకు ఊహించవచ్చు.
         విష్కంభః ప్రీతి రాయుష్మాన్ సౌభాగ్యం శోభనం తథా 
                  అతిగండ స్సుకర్మాచ ధృతి శ్శూల శ్చ గండకః।। 
         వృద్ధిర్ ధ్రువశ్చ వ్యాఘాతో హర్షో వజ్రశ్చ సిద్ధికః 
                  వ్యతీపాతో వరీయాం శ్చ పరిఘ శ్శివ సిద్ధకౌ 
         సాధ్య శ్శుభశ్చ శుక్లో వై బ్రహ్మైంద్ర శ్చైవ వైధృతిః।। 
                  యోగా జ్యోతిశ్శాస్త్ర ముఖ్యాః కథితా స్సప్తవింశతిః।। 

    1) విష్కంభ యోగము 2) ప్రీతి యోగము 3) ఆయుష్మద్యోగము 4) సౌభాగ్య యోగము 5) శోభన యోగము 6) అతిగండ యోగము 7) సుకర్మ యోగము 8) ధృతి యోగము 9) శూల యోగము 10) గండ యోగము 11) వృద్ధి యోగము 12) ధ్రువ యోగము  13) వ్యాఘాత యోగము 14) హర్ష యోగము 15) వజ్ర యోగము 16) సిద్ధి యోగము 17) వ్యతీపాత యోగము 18) వరీయో యోగము 19) పరిఘ యోగము 20) శివ యోగము 21)  సిద్ధ యోగము 22) సాధ్య యోగము 23) శుభ యోగము 24) శుక్ల యోగము 25) బ్రహ్మ యోగము 26) ఐంద్ర యోగము 27) వైధృతి యోగము

 
కరణములు పదకొండు.

          కరణములు పంచాంగాలలో చివరివి. ఇవి ప్రతి తిథిలో సగభాగమని విద్వాంసులు చెబుతారు. కరణాలు మొత్తం 11. వీటిలో 4 స్థిరమైనవి  - అమావాస్య, పూర్ణిమ దగ్గర ఉంటాయి. మిగిలిన ఏడు చరమైన కరణములు, ఒక చాంద్రమాసములో, ఎనిమిది సార్లు చర కరణాలు, ఒకసారి స్థిర కరణాలు వస్తాయి.

(8 x  7  = 56 + 4 = 60). మొత్తం 30 తిథులు కాబట్టి, ఒకతిథికి రెండు కరణముల చొప్పున 60 కరణాలు ప్రతినెలలో ఉంటాయి. 


తిథయః                                    శుక్ల పక్షే                                                కృష్ణ పక్షే
ప్రతిపత్                           (కింస్తుఘ్న) కౌస్తుభ -బవ                      బాలవ  - కౌలవ 
ద్వితీయా                       బాలవ  - కౌలవ                                    తైతిల గరజ 
తృతీయా                      తైతిల  - గరజ                                       వణిక్ భద్ర (విష్టి) 
చతుర్థీ                         వణిక్ భద్ర (విష్టి)                           భవ - బాలవ 
పంచమీ                      భవ  - బాలవ                                       కౌలవ తైతిల 
షష్ఠీ                           కౌలవ  - తైతిల                                     గరజ- వణిజ 
సప్తమీ                         గరజ  - వణిజ                                       భద్ర (విష్టి) - బవ 
అష్టమీ                         భద్ర  - బవ                                           బాలవ  - కౌలవ 
నవమీ                          బాలవ  - కౌలవ                                    తైతిల గరజ 
దశమీ                          తైతిల  - గరజ                                       వణిక్  - భద్ర(విష్టి) 
ఏకాదశి                       వణిక్  - భద్ర(విష్టి)                                బవ- బాలవ 
ద్వాదశి                        బవ- బాలవ                                          కౌలవ- తైతిల 
త్రయోదశి                   కౌలవ- తైతిల                                         గరజ- వణిక్ 
చతుర్దశి                      గరజి  - వణిక్                                       భద్ర(విష్టి) - శకుని 
పూర్ణిమ                       వణిక్  - భద్ర(విష్టి)                               అమావాస్య- చతుష్పాత్  - నాగ 
చరాణి కరణాన్యేవం భవో బాడబ కౌలవౌ।    తైతిలో గరజశ్చైవ వణిగ్ భద్రశ్చ సప్తమః।। 
స్థిరాణి కరణాన్యాహూ రాకామావాస్యయోః క్రమాత్। కౌస్తుభశ్శకుని శ్చైవ చతుష్పాన్నాగ ఇత్యపి।।