జగల్లగ్నము

· జగల్లగ్నము వృశ్చికను పరిశీలించగా 1. లగ్న రాజ్యాధిపతి బుధుడు అష్టమ స్థాన శత్రు క్షేత్ర స్థితి వ్యయభాగ్య లాభాధిపతులైన రవి, శుక్ర చంద్రుల వీక్షణ లగ్నమునకు గురుని ఆచ్ఛాదన. 2 ధన భాగ్యాధిపతి శుక్రునికి ఉచ్చ. ధన స్థానమునకు బుధిని వీక్షణ.

·  3 తృతీయ అష్టమాధిపతి కుజుడు స్వక్షేత్ర స్థితి, పంచమ షష్ఠాధిపతి శని యుతి. 4 చుతుర్థ సప్తమాధిపతి గురుడు వ్యయమందు మిత్ర క్షేత్ర స్థితి రాహువుతో యుతి. మరియు చతుర్థ స్థాన వీక్షణ.

·  5. పంచమ షష్ఠాధిపతి శనికి తృతీయ స్థానస్థితి. 6 షష్ఠమందు కేతు స్థితి. 7 సప్తమందు ద్వితీయ భాగ్య లాభ వ్యయాధిపతులు శుక్ర చంద్రరవులు

· 8. అష్టమమందు లగ్నాధిపతి మరియు అష్టమాధిపతికి స్వక్షేత్ర స్థితి. 9 భాగ్యస్థానము శని, కుజులు వీక్షించుట మరియూ భాగ్యాధిపతికి సప్తమ క్షేత్రమందు ఉచ్చస్థితి.

· 10 రాజ్యాధిపతికి అష్టమస్థాన స్థితి, రాజ్యమునకు కుజ వీక్షణ. 11 లాభాధిపతి చంద్రుడు రవి శుక్ర యుతి. 12 వ్యయాధిపతి రవి మిత్ర క్షేత్ర స్థితి చంద్ర శుక్ర యుతి.

·  వర్ష, జగల్లగ్నాధిపతులు బుధ, కుజులు సమవైరులగుటచే మధ్యమ ఫలము. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వముల మధ్య పరిమిత సహాయ సహకారములు. ఇరువురు ఒకరిపైనొకరు ఆధిపత్యము కోసం ప్రయత్నిస్తూనే తగు సమన్వయముతో కూడి పురోభివృద్ధి సాధించగలరు.

· కుజ శనుల ఏకరాశి స్థితిచే సైనిక చర్యలు తప్పవు. పొరుగు దేశములు, రాష్ట్రములతో అసఖ్యత. పాలకులకు, సైన్యమునకు ఇబ్బందులు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వములకు పరీక్షా కాలము.

·  1) లగ్నాధిపతి బుధుడు అష్టమస్థితి అయిననూ లగ్నాధిపతిని గురుడు విశేష దృష్టిచే వీక్షించుట వలన లగ్నమును గురుడు అచ్చాదించుటచే లగ్న బలము బాగుండుటచే రాష్ట్ర ప్రజలు ఆరోగ్యముతో, ఐశ్వర్యములతో నుందురు. పాలకులు క్రమ పద్ధతిలో పాలన సాగింతురు. యువకులు పాలనలో భాగస్వాములయ్యెదరు.

· 2) ధనస్థానాధిపతి సప్తమ కేంద్రమున ఉచ్చ యందుండుటచేతనూ లగ్నాధిపతి ధన స్థానమును వీక్షించుట చేతనూ వస్తువుల నిల్వలు భాగుగా ఉండును. పరిపాలన యందు వాగ్వివాదములు, ఒడిదుడుకులు లేక నాయకుల రాష్ట్ర ప్రజామోదములో చక్కని పరిపాలన సాగింతురు. బ్యాంకులకు ప్రభుత్వమునకు ఆదాయము బాగుండును. స్టాకు మార్కెట్లు లాభాలతో నడచును.

·  3) యాత్రల యందు పర్యాటక రైళ్ళు, విమాన యానములు వార్త టీవీ, రేడియో రంగముల యందు ప్రమాదభరిత సంఘటనలు, సమిష్టి వ్యవహారములు నెమ్మందించును. ప్రసార మాధ్యములకు నష్టము వాటిల్లును.

·   4) పంచాయితీ రాజ్ మున్సిపాలిటీలు, గృహనిర్మాణ శాఖల అధికారులు చక్కగా పాలన సాగింతురు. పాడి పరిశ్రములు చక్కగా ఉండును. విద్యా సంస్థలయందు చక్కని ఫలితములు ఉండును.

·   5) సంక్షేమ హాస్టల్సుకు విద్యా వైజ్ఞానిక విషయములకు ప్రభుత్వము పూర్తి సహకారమిచ్చును. నాటక చలనచిత్ర, క్రీడా రంగములకు ప్రోత్సాహకములు ఉండును. జూదములపై నిషేధములు ఉండి సమర్థవంతముగా అరికట్టబడును.

·    6) పోలీసు రక్షణశాఖలు సమర్థవంతముగా పనిచేయును. నక్సలింజం, రౌడీయుజం అరికట్టబడును.

·    7) ప్రేమ వివాహములు అధికముగా ఉండును, పొరుగు రాష్ట్రములతో మైత్రీ భావములుండును.

·    8)  ప్రజావ్యతిరేకతలు లేక ప్రభుత్వము శక్తియుక్తులతో పాలన సాగించును.

·  9) భాగ్యాధిపతి శుక్రుడు సప్తమ కేంద్ర స్థితిచే రాష్ట్రాదాయము బాగుండును. వ్యాపార అభివృద్ధి ఉండును. నాయకులు సన్మానములను పొందెదరు.

·  10) పాలక పక్షము బలముగా ఉండును. ప్రభుత్వ నిర్ణయములు ప్రజలకు సంతృప్తిగా ఉండును. కొన్ని సమయములందు సైనిక చర్యలుండును.

·  11) స్వచ్ఛంద సేవా సంస్థలకు, ఆశ్రమములకు, దేవాలయములకు ఎక్కువ నిధులు కేటాయింపబడును. నేరస్థుల సంఖ్య తగ్గును. వైద్య, జైళ్ళ శాఖల అధికారులు సమర్థవంతముగా పనిచేయుదురు.

· 12) ధార్మిక సంబంధమైన పనులకు ప్రభుత్వము అధికముగా ఖర్చుచేయును. ప్రజలు తీర్థయాత్రలకు, దైవారాధనలకు ధనము ఖర్చుచేయుదురు.

· ఈ సంవత్సరము రాజు శుక్రుడు, వర్ష లగ్నము కన్యకు ద్వితీయ భాగ్యాధిపతి శుక్రునకు  (సప్తమ) కేంద్రమున ఉచ్ఛ స్థితి కలిగి యుండుట, జగల్లగ్నాధిపితికి స్వక్షేత్ర స్థితి మరియు ధన పంచమాధికి కేంద్ర రాజ్యస్థితి వలన దేశ సార్వభౌమాధికారము కలిగి, ప్రజల సాధారణ జీవన స్థితి, ఆచార వ్యవహారములు, ప్రజారోగ్యము వంటి విషయాలలో ప్రభుత్వాలు చర్యలు తీసుకుని దేశ సాంస్కృతిక, ఆర్ధిక పరిపుష్టికి ఇతోధికంగా కృషిచేస్తాయి.

· పరిశోధనా సంస్థలు విశేష కృషి చేస్తూ అభివృద్ధి పథం. సమాజంలో అసాంఘిక శక్తులు చేయు మోసాలు, నేరాలను అరికట్టడంతో బాటు కరువు కాటకాలు, ప్రకృతి వైపరీత్యాల వలన కలిగే ప్రాణ నష్టమును ఎదుర్కొనుటకు పటిష్ఠమైన ప్రణాళికను అమలుపరుస్తారు.

·  ద్వితీయ లాభాధిపతుల కలయిక వలన దేశ ఆర్ధిక పరిస్థితులు మెరుగవుతాయి. గృహ నిర్మాణ రంగము అభివృద్ధి లో జాతీయ మౌళిక వసతుల కల్పనలో ఆర్ధిక స్థిరత్వము సాధించుట ద్వారా జాతీయ సంపదను పెంచడంలో వాణిజ్య బ్యాంకుల కృషి చెప్పుకోదగినది.

· ఆర్ధిక వ్యవహారాలల నిర్వహణ సక్రమంగా ఉంటుంది. ఇతర దేశాలతో దౌత్య సంబంధాలను ద్విగుణీ కృతం చేసుకుని, దేశాల మధ్య శాంతి సామరస్యాలను నెలకొల్పడానికి తగిన చొరవ, సత్తా మన దేశం కలిగి ఉంటుంది.

· విద్య, వ్యవసాయం, పంటలు వంటి విషయాలలో స్థబ్దుగా వ్యవహరిస్తుంది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి నెలలలో కాల సర్పదోష ప్రభావముచే శిశు సంక్షేమం, ప్రజారోగ్యము, అంటువ్యాధులను అరికట్టడం వంటి విషయాలలో పురోగతి అంతంతం మాత్రం. ఈ కాలంలో కరువు కాటకాలు, ఆకలి చావులు, రైతుల అప్పుల బాధలు ఎక్కువవుతాయి.

·   కర్మాగారాల నిర్మాణం , వాయు జల రక్షణ సంస్థలలో అనుకోని ఇబ్బందులు ఎదురవుతాయి. అంతరిక్ష విజ్ఞాన సంస్థలు, శాస్త్ర సాంకేతిక పరిశోధనా రంగాల సంస్థలు అభివృద్ధిబాటలో పయనించి దేశ ప్రగతికి ఆర్ధిక పరిపుష్టిని కలిగిస్తాయి.

· సస్యాధిపతి శని అగుటచే నల్లని భూములలో పంటలు బాగుగా ఫలించును. భూముల ధరలు అధికమయ్యి, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, భూముల క్రయ విక్రయ దళారీలకు మూడు పువ్వులు ఆరుకాయలుగా ఉండును. గృహ నిర్మాణ రంగము దినదినాభివృద్ది సాధించును.

·  ఈ సంవత్సరం ప్రారంభం నుండి సెప్టెంబర్ మధ్యకాలం వరకు వృశ్చిక రాశియందు కుజ, శనుల వక్రం కుజ స్తంభనచే కొండ ప్రాంతాలు, అరణ్య ప్రాంతాలలో ఉగ్రవాద చర్యలకు ప్రతిగా ప్రజా రక్షణకు పోలీసు, మిలటరీ చర్యలు తప్పవు.

·  కాలువలు, గనులు విష ప్రభావితమగును. పండ్ల తోటలు, ఉద్యానవనములు దెబ్బతినకుండా తగుచర్యలు తీసుకుంటారు.

·    గురుణా సౌరిణా వాపి రాహు యుక్తేథవా శిఖీ। శిఖీ యోగశ్చండాల నామోయం రాజా రాష్ట్ర వినాశనం।। అను సూక్ష్మముచే గురు చండాలత్వము వలన దేశారిష్టం జరుగునని తెలియచున్నది. ఈ దోషానంతరం పాలకులు, అధికారులు పాలనలో మెరుగు సాధించి ప్రజల విశ్వాసాన్ని చూరగొంటారు.

·  నూతన రాజధాని నిర్మాణ విషయంలో కొంత పురోగతి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహగమనం, సహాయ సహకారములు, సమన్వయం తోడ్పాటు మాత్రమే దేశానికి, రాష్ట్రానికి అభివృద్ధికి, పురోగతికి బాటలు వేస్తుంది.

·   చైత్రమున పవిత్ర స్థలాలు, పుణ్యక్షేత్రాలలో అధిక రద్దీ, వాతావరణ ఉష్టోగ్రత పెరుగును.

·  వైశాఖమున మే 14 నుండి 19 ల మధ్య తేదీలలో బుధ, శుక్ర సమాగమము వలన అధిక వర్షములు మరియూ గాలిదుమారములు, తుఫాను వాతావరణము. బంగారము, అన్న పదార్థముల ధరలు పెరుగును.

·   జ్యేష్ఠమున మాస ప్రారంభములో తొలకరి వర్షములు పడిననూ, ఉష్ణాధిక్యత ఎక్కువగా ఉండును.  జూన్ 10, 11, 12 తేదీలలో విశేషంగా తదుపరి మోస్తరుగా వర్షములు. రజితం, బంగారం, రాగి ధరలు సమముగా ఉండును. తిల తైలములు, ప్రతిరేటు గిరాకీ అగును.

·  ఆషాఢమున జూలై 7వ తేదీ నుండి 15 జూలై మధ్య వర్షాధిక్య యోగము. ధాన్యం, బియ్యం, అపరములు ధరలు పెరిగి నిలబాటుగా ఉండును. నిత్యావసర వస్తువుల ధరలు గిరాకీ.  

·   శ్రావణమున నూనే, బెల్లము గిరాకీ.

·   భాద్రపదమున కొబ్బరి కాయలు, పాత సామగ్రి, ఔషధములు గిరాకీ. వరదలు.

·   ఆశ్వయుజమున బంగారు వస్తువులు, చందనం, ధాన్యాదులకు నష్టము వాటిల్లును.

·   కార్తికమున ధాన్యము సమధర కలిగియుండును. మూల ధాతువులకు అధిక దరలు.

·   మార్గశిరమున తిలలు, ప్రత్తి, దూది, దారము అధిక ధరలు కలిగియుండును.

· పుష్యమున పొగమంచు, మార్గావరోధములు, మంచు కురియుట, జనవరి 11 నుండి 17ల మధ్య వర్షయోగము.

· మాఘమున కుజ గురుల సమసప్తక సంబంధం వల్ల అనావృష్టి యోగములు తీవ్రమై వేడిగాలులు, ఆకాశం పొడిగా ఉండుట.

·  ఫాల్గొనమున  మార్చ్ 15 నుండి సంవత్సరాంతం వరకూ అనావృష్టి యోగములు, వడగళ్ళు వానలు, పంటకు నష్టం అక్కడక్కడా కలిగిననూ, రవి ఆర్ద్రా ప్రవేశకాలము ప్రతికూలమగుట వలన రెండు పంటలు సామాన్యం  అక్కడక్కడా అన్ని రకముల పంటలు కలిసివస్తాయి.

·   ప్రజలు కలిదోష నివారణకై భగవన్నామస్మరణ, దుర్గా, విష్ణు సహస్రనామ పారాయణలు, గో సంరక్షణ చర్యలు తీసుకొనుట వలన లోకమునకు మేలు తప్పక జరుగును. జగన్మాత, లోకకర్త శ్రీ సూర్యభగవానుడు, యుగకర్త కృష్ణభగవానుడు, కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడు సమస్త మానవులకు సద్బుద్ధినిచ్చి కాపాడి లోకమునకు శాంతి రక్షణ, సన్మార్గములను, సమస్త సన్మంగళములను కలిగించెదరు గాక.