1.   మేషరాశి ఫలితములు

అశ్విని:1, 2, 3, 4 పాదములు భరణి:1, 2, 3, 4 పాదములు కృత్తిక:1 వ పాదము

                ఆదాయం - 2          వ్యయం         - 8

                రాజపూజ్యం- 1        అవమానం - 7

         ఈ రాశివారికి 2016 ఆగస్ట్ 11 వరకు గురుడు 5ట తామ్రమూర్తి, తదుపరి వత్సరమంతయు 6ట లోహమూర్తి. శని సంవత్సరాది నుండి 2017 జనవరి 26 వరకు 8ట సువర్ణమూర్తిగానూ, తదుపరి 9ట వత్సరమంతయు రజితమూర్తి, రాహువు 5, కేతువు 11ట సువర్ణ మూర్తులు.

         రాహు, కేతువులు పంచమ లాభస్థానములందు సంచారము. ధనలాభము, పుత్ర మూలక ఆనందము, సౌఖ్యము బృహస్పతి పంచమరాశి యందుండగా కలుగును. ద్రవ్యలాభము, ఐశ్వర్యవృద్ధి, తలచిన పనులు నెరవేరుటచే ఆనందము, అదృష్టము కలసివచ్చుట, స్వజన సౌఖ్యం, బంధువుల వలన సుఖము కలుగును. ఆగస్ట్ తదుపరి భార్యాపుత్రుల వలన విరోధం, మాట పట్టుదలలు, స్వల్ప  అనారోగ్యము, అగ్ని భయం, బంధు కలహము కలుగును. సంవత్సర ఉత్తారార్థములో గత రెండు సంవత్సరముల నుండి నిలిచిన  కార్యములు వ్యవహార  ప్రతి బంధకములు క్రమేపి తొలగును.

        శరీర ఆరోగ్యము బాగుండును. కార్యానుకూలత కలుగునుఒకవైపు ధనసంపదవృద్ధి, మరొకవైపు నుండి ధనము ఖర్చు, ధనాగమము ఖర్చు రెండూ ఉండును. చేసే పని యందు నైపుణ్యత ప్రదర్శించుట, పై అధికారుల మన్ననలు, సమిష్టిగా కార్యములను సాధించుట, నాయకత్వ లక్షణములను ప్రదర్శించుట, కార్యసాధకులు అగుదురు. సకాలమునకు భుజింపకపోవుట, అందరి మన్ననలను పొందుట, అందరిచే పూజింపబడుట మొదలగునవి జరుగునుఆలస్యమైనను ఇష్టభోజనము, ఆకస్మిక ధనలాభము,వస్త్ర, పుష్పమాలికలు మొదలగువాని వలన లాభములు కలుగుట, వాహనలాభము, సౌఖ్యము, పశుసంపద పెరుగుట, ఆగస్ట్ వరకు గురుబలముచే కార్యసిద్ధి తదుపరి అనారోగ్య సూచనలు.

        ఈ రాశివారికి ఈ సంవత్సరము శుభాశుభ మిశ్రమ ఫలితములుండును. విద్యార్థులు శ్రమించిన గాని ఉత్తీర్ణులగుట కష్టం. వ్యవసాయదారులకు  రెండవ పంట కలసి బాగుగా వచ్చును. వ్యాపారస్తులకు  మిశ్రమ ఫలితములు. ఐరన్, సిమెంట్, కలప వ్యాపారస్తులకు సంవత్సరము ఉత్తరార్థము రాజకీయ నాయకులకు, సినీనట, గాయకులకు, అన్ని రంగములవారికి మిశ్రమ ఫలితములు బాగా కలసివచ్చును. చాలాకాలము నుండి సంతానలేమితో బాధపడుచున్నవారికి ఈ సంవత్సరము శుభ ఫలితములుండును.2017 జనవరి 26 తదుపరి సంవత్సరాంతం సింహరాశిలో గురుసంచార కాలము నుంచి ఫలితములుండును. అధికారుల మన్ననలు, ప్రశంసలు ఉంటాయి. పట్టుదలతో , కార్యదక్షతతో దీక్షతో పనిచేసి  అనుకున్న ఫలితాలు సాధిస్తారు.

        వ్యాపారస్తులకు లాభదాయకం. విద్యార్థులకు మంచి సమయం. భార్యా సంతతితో సుఖ సంతోషాలు పంచుకుంటారు. ఎంతోకాలంగా నిలిచి ఉన్న వివాహ ప్రయత్నములు అనుకూలిస్తాయి. సహజములో ముఖ్య వ్యక్తులు మిమ్ములను సందర్శిస్తారు. మీకు గౌరవం కలుగుతంది. శారీరికంగాను, మానసికంగానూ మంచి ఆరోగ్యం ఉంటుంది. క్రమశిక్షణతో వ్యవహరిస్తారు. తీర్థయాత్రలకు మంచి సమయం.

        ఈ రాశివారికి అదృష్టసంఖ్య ‘9’.1,2,3,6 తేదీలు, సంఖ్యలు, ఆది,బుధ, గురు వారములు కలిసిన మంచి జరుగును. షష్ఠ గురు ప్రభావముచే అనారోగ్య నివారాణార్థము ఈశ్వరాభిషకము, శివారాధన మంచి కలిగించును. అష్టమ శనిదోష నివారణకు మందపల్లిలో శనైశ్చరునికి తైలాభిషేకము. తదుపరి శివాలయములో పరమేశ్వరుని అభిషేకము చేసిన దోష నివారణయగును.