9.ధనూ రాశి ఫలితములు

మూల1,2,3,4 పాదములు, పూర్వాషాఢ1,2,3,4 పాదములు, ఉత్తరాషాఢ 1వపాదము

   ఆదాయం - 5                    వ్యయం - 14

   రాజపూజ్యం -4                  అవమానం - 2

                   ఈ రాశివారికి 2016 ఆగస్ట్ 11 వరకు గురుడు 9ట తామ్రమూర్తి తదుపరి వత్సరమంతయును 10ట లోహమూర్తి. శని సంవత్సరాది నుండి 2017 జనవరి 26 వరకు 12ట తామ్రమూర్తిగాను, తదుపరి 1ట వత్సరమంతయు సువర్ణమూర్తి. రాహువు 9ట కేతువు 3ట తామ్రమూర్తులు.

         జన్మరాశి శనిలో సంచారకాలము  దోషము. రాహువు సంవత్సరమంతయు భాగ్యస్థానమందు సంచరించును. వీరు గురు బలముచే ఎంతటి కార్యమునైన విజయవంతముగా పూర్తి చేయగలరు.ఈ కాలంలో ధనలాభం, ఉన్నత అధికారుల ప్రశంసలను పొందెదరు. ఉద్యోగులపై అధికారుల మెప్పు పొందెదరు. ఏ వృత్తివారికైనను ధనలాభము, కార్యసిద్ధి కలుగును. శని వ్యయరాశి సంచారకాలములో స్థానచలన సూచనలు, అనారోగ్యం, కుటుంబ సభ్యుల ఆరోగ్యముకై జాగ్రత్తలు తీసుకొనుట, ధనము ఖర్చు అగుట, మొదలైన ఫలితములుండును.

         రాహుకేతువుల ప్రభావము ఈ రాశివారికి అనుకూలము. ధనలాభములు, మానసికసంతోషము, ముఖ్యముగా వైద్య, ఫార్మసీ మత్తుమందులు (ఎనస్తీషియా) విభాగముల వారికి విపరీత లాభములుండును. సోదర మూలకముగా ఉత్తమ ఫలితములు ఉండును. రాజకీయ నాయకులు సన్మానములు  పొందెదరు. అనుకూల సమయం. అధికారుల ప్రశంసలకు పాత్రులగుదురు.

         న్యాయవాదులు, వైద్యులు, వ్యాపారులకు కాలము కలిసి వచ్చును. లాభార్జన చేయుదురు. అవివాహితులకు వివాహమగును. తలపెట్టిన గృహనిర్మాణములను సమర్థవంతముగా పూర్తిచేయుదురు. శని ద్వాదశ జన్మ స్థానములో సంచారము జరుగునప్పుడు త్రిప్పట, వృధా ధనవ్యయము, కాలయాపన, చింత, దేహారోగ్యము, ఎముకల చికిత్స మొదలగు ఫలితములుండును.

              స్థాన చలన, స్థానభంగ సూచనలుండును. అకారణ విరోధములు, బంధుమిత్రద్వేషములు, మనస్థిమితము లేకపోవుట, ప్రతిరంగములోని వారికి పోటీతత్త్వము ఎదురగుచుండును. రాహుబలము, ధనార్జన యుండును.

         ఈ రాశివారికి అదృష్టసంఖ్య 3. 1,2,5,9 తేదీలు, సంఖ్యలు, ఆది,బుధ, గురువారాలు కలిసిన యోగకారకములు . శనిదోష నివారణకు  ఈశ్వరాభిషేకములు, మందపల్లిలో శనైశ్చరునికి తైలాభిషేకములు. శనివార  నియమములు, ఆంజనేయ, విష్ణు స్తోత్ర పారాయణలు చేసిన మేలు కలుగును. సుబ్రహ్మణ్యారాధనలు కావించిన మేలు కలుగును. కేతు దోషము తొలగుటకు సుబ్రహ్మణ్య, పార్వతీ ఆరాధనలు, చండీ పారాయణలు కావించిన  మేలు.