11.కుంభ రాశి ఫలితములు

ధనిష్ఠ 3,4 పాదములు, శతభిషం 1,2,3,4 పాదములు, పూర్వాభాద్ర 1,2,3 పాదములు

            ఆదాయ - 8                      వ్యయం - 8

            రాజపూజ్యం - 3                 అవమానం - 5

 ఈ రాశివారికి 2016 ఆగస్ట్ 11 వరకు గురుడు 7ట రజితమూర్తి, తదుపరి వత్సరమంతయును 8ట తామ్రమూర్తి, శని సంవత్సరాది నుండి 2017 జనవరి26 వరకు 10ట సువర్ణమూర్తిగాను , తదుపరి 11ట వత్సరమంతయు సువర్ణమూర్తి, రాహువు 7, కేతువు 1ట లోహమూర్తులు.

వీరికి సంవత్సరాది నుండి ఆగస్ట్ 11 వరకు గురుబలము సామాన్యం. తదుపరి సంవత్సరాంతము వరకు అనుష్టాన సంచారము. మిక్కిలి దోషము, ఆరోగ్యలోపం, స్థాన చలన సూచనలు, ధననష్టం, ఇంటా బయటా విరోధములు, అకారణ కలహాలు. శని రాజ్యస్థాన సంచారం, కార్యనాశనం, మనోవ్యాకులం, గృహనిర్మాణము, భూసేకరణకు చేయు ప్రయత్నములు ఫలించవు. రాహువు సప్తమస్థాన సంచారం భయం, మానసిక, శారీరక ఆందోళనలు, కళత్ర అనారోగ్య సూచనలు.కేతువు జన్మరాశి సంచారం, భయము. స్త్రీ, పురుషులకు పరీక్షాకాలం. శ్రమకుతగ్గ ఫలితము దక్కుట కష్టము.వ్యవసాయదారులకు ప్రతికూలం. విద్యార్థులు శ్రమపడినా ఫలితము పొందలేరు. ఉద్యోగులు శ్రమపడినా పై అధికారులచే మాటలు పడుట. కళాకారులకు, వివిధ వృత్తులవారికి పరీక్షాకాలము. ఈ రాశివారు ఏరంగంలో వారైనను అన్నీ ఆలోచించి ప్రవర్తించుట మంచిది. గురు, శని, రాహు, కేతువులు మిక్కిలి దోషులు.

          చతురతతో నిర్వహణ సామర్థయము పెరుగును. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో తరచూ పాల్గొంటారు. భగవత్ దర్శనము కలుగుతుంది. పాడు జనులను సేవిస్తారు. ఆర్థిక లావాదీవీలను చక్కగా నడపగలరుద్వితీయార్థంలో  ముఖకళ తప్పినట్లుంటుంది. చర్మవ్యాధులు, నరఘోష పెరిగినా జయించగలరు. గృహమున ఆనందకర వాతావరణం. వంశోద్ధారకులను చూసి మురిసిపోతారు. మనోవ్యాకులతో, దుఃఖము వలన పరితాపం, దోషము. ఉద్యోగ, వృత్తి విషయాల్లో ఇబ్బందులెదురైనా  పట్టుదలతో నెగ్గుకు రాగలరు.

          2017 ప్రారంభము నుండి గత కాలములో నిలిచిన కార్యములన్నియు సిద్ధించుట, హుషారు, శారీరక, మానసిక ఆరోగ్యము, ద్రవ్యలాభము, స్త్రీ, పుత్ర సుఖ వర్ధనం, సంతానం  వృద్ధిలోనికి వచ్చుట, ఇష్ట కార్యసిద్ధి, మనోనిర్మలత్వం కలుగును.

తరచూ భార్యాపుత్రులతో జగడము, రోగబాధ, కుటుంబమును వదిలి విదేశములందు సంచరించుట, త్రిప్పట, నీచపనుల ద్వారా ధనమును సంపాదించాలనే కోరిక, వ్యవహార ప్రతిబంధకములు, చర్మ, అంటువ్యాధుల బారిన పడటం, వ్యర్థముగా రాకపోకలు సాగించుట, చేతులకు, కాళ్ళకు జబ్బులు, పై అధికారులను దర్శించుట ద్వారా కార్యసిద్ధి, కోపము, శిరోవేదన, అగ్నిభయము, నరముల నిస్సత్తువ కలుగును.

ఈ రాశివారికి అదృష్టసంఖ్య 8. 2,3,6,9 తేదీలు. సంఖ్యలు మంగళ, శుక్ర, సోమవారాలు కలిసిన మరింత మేలు. గురుదోష నివారణకు శివాభిషేకములు. శివస్తోత్ర, దత్తాత్రేయ స్తోత్రపారాయణ, గురువార నియమములు.శనిదోషనివారణకు శివాభిషేకములు, శివ,ఆంజనేయస్తోత్ర పారాయణలు, శనివార నియమములు, శివ దర్శనములు ఆచరించవలెను. రాహు, కేతు దోష నివారణకు శుక్ర, మంగళవార నియమములు, సుబ్రహ్మణ్యారాధన, దేవీస్తోత్ర, చండీపారాయణలు ఆచరించిన మేలు.