12.మీన రాశి ఫలితములు

పూర్వాభాద్ర 4వపాదము, ఉత్తరాభాద్ర 1,2,3,4 పాదములు, రేవతి  1,2,3,4పాదములు

           ఆదాయం - 5                             వ్యయం - 14

           రాజపూజ్యం - 6                          అవమానం - 5

          ఈ రాశివారికి 2016 ఆగస్ట్11 వరకు గురుడు 6ట లోహమూర్తి, తదుపరి వత్సరమంతయు 7ట రజితమూర్తి, శని సంవత్సరాది నుండి 2017 జనవరి 26 వరకు 9ట  లోహమూర్తిగాను, తదుపరి 10ట వత్సరమంతయు తామ్రమూర్తి. రాహువు 6, కేతువు12ట తామ్రమూర్తులు.

          వీరికి ఆగస్ట్11 వరకు గురుబలము సామాన్యము. తదుపరి గురుబలము కలదు. శని భాగ్యస్థాన సంచారముతో కొంత సౌఖ్యము. రాహువు షష్ఠస్థాన సంచారం సౌఖ్యం, శత్రునాశనం, కేతువు వ్యయస్థాన సంచారం క్లేశములు. వీరికి ఆగస్ట్ 11 తదుపరి, సకల కార్యజయం, శతృనాశనం, గొప్పవారి సన్నిహితత్వము కలుగును. ధర్మకార్యాచరణ, దైవము నందు నమ్మకము. వీరికి గురు, రాహు బలములు ఉండుటచే సకల కార్యవిజయము. పెద్దవారి మన్ననలను పొందుట, అవివాహితులకు వివాహ ప్రాప్తి, కళత్ర సౌఖ్యము. గృహానందము కలుగును, శని భాగ్యస్థాన సంచారం. స్థానచలన సూచనలు, అనవసర ధనవ్యయం, వ్యాపారులకు అనుకూలం.

          విద్యార్థులకు సానుకూల ఫలితములు. గృహమున వృత్తి, ఉద్యోగాదులలో అధిక శ్రమ, త్రిప్పట, ప్రయాణములు, అలసట, అకాల భోజనము తద్వారా అనారోగ్యం. శరీరము కృశించుట, శరీరమందు నొప్పులు కలుగును. రత్నముల మూలకముగా ధనప్రాప్తి, ఆనందము, ఆరోగ్యము, మంచివారితో గోష్ఠియు కలుగును. నూతన విషయాలను పరిశోధన చేయుదురు. ఇంటిలో భోజన సౌఖ్యము, మార్గావరోధములు కలుగును. ఒకానొక్కప్పుడు ధన లాభమును, సుఖమును పొందును.

          ఉద్యోగములో జగడములు సంభవించును. కోర్టు వ్యవహారములు కొలిక్కి రాకపోవుట, ధన వ్యయము, ఉద్యోగులకు ఆదాయమున్నూ లెక్కకు మించిన ఖర్చులు చేసి ఆర్ధిక సమతుల్యతను దెబ్బతీస్తారు. గృహోపకరణ వస్తువులు కొనుగోలు. వ్యవసాయదారులకు రెండు పంటలు అనుకూలించును. న్యాయవాదులు, వైద్యులు, కళాకారులు, వృత్తి పనివారలకు పౌల్ట్రీ, పాడి పరిశ్రమ, మత్స్య పరిశ్రమలవారలకు అనుకూలం.

          వాక్చాతుర్యము, తార్కిక సంభాషణలు, విజ్ఞాన విషయముల యందు శ్రద్ధ చూపి ఫలితములు సాధిస్తారు. రాజదర్శనము, రాజ సంభాషణము, మంచి సౌఖ్యము కలుగును. చతురతతో కార్యనిర్వహణ, మధ్య మధ్యలో అహంభావము కలుగును.

          ఈ రాశికి అదృష్ట సంఖ్య 3. 1, 2, 5, 9 తేదీలు, సంఖ్యలు, ఆది, సోమ, గురు వారములు కలసిన మరింత మేలు. శనిదోష నివారణకు శివాభిషేకం, శివ, ఆంజనేయ స్తోత్ర పారాయణలు, శనివార నియమములు పాటించిన దోష నివారణయగును. కేతుదోష నివారణకు దుర్గాస్తోత్ర పారాయణ, చండీపారయణ, సుబ్రహ్మణ్య ఆరాధన, మంగళవార నియమములు పాటించిన మేలు కలుగును.


 

నెలవారీ ఫలితములు

ఏప్రిల్:పూర్వార్ధములో అకాల భోజనం, మనస్సున ఆందోళన, శరీరబాధ, బంధు మిత్రులతో విరోధము, ధనలాభము లేకపోవుట, చెడు స్నేహములు, మనస్సంకటము. వ్యవసాయ, వర్తక వ్యాపారముల యందు స్వల్పలాభము.

మే:శృంగార కళాభిమానులు, దైవచింతన గలవారగుదురు. జీవనమందు ముందడుగు వేస్తారు. ధైర్యయుక్తమగు బుద్ధి పరాక్రమము అధికముగా ఉండుటయు, శత్రు జయము, ఎల్లప్పుడు శుభమును, శత్రు వర్గముచే గో, భూ లాభ ప్రాప్తి.

జూన్: ద్రవ్య నాశనము, బంధువులతో విరోదము, మనస్తాపము. స్వబుద్ధి ప్రకారం ప్రవర్తించుట, బంధువులతో నెగ్గుకుని వచ్చుట, స్త్రీలతో సంభాషణ యందు ప్రీతి కలుగును. పుత్ర, మిత్ర, బంధు, కళత్రములతో విద్యాగోష్ఠి చేయుట.

జూలై:స్నేహితుల వలన కష్టము, బుద్ధి స్థైర్యములు కోల్పోవుట. ద్రవ్య వ్యయము, అవయవములందు ఉష్ణము వలన తాపము. పిత్త వాతాది దోషములు, మృత్యుభయం, అకస్మాత్ కలహాలు. సుభోజనము, ఇష్టార్థ లాభము కలుగును.

ఆగస్ట్: సుఖము, యత్నకార్య సిద్ధి, శరీరము కాంతివంతము, సుఖవంతమగుట, సంతోషం, ధనధాన్య వృద్ధి. శతృనాశనము, ఎల్లప్పుడూ సుఖము, శుభమూ కలుగును. జ్ఞాతి విరోధములు కలుగును. తండ్రికి గాయములు కలుగును.

సెప్టెంబరు:మనోక్లేశము, ధన వ్యయమైననూ చేతినిండా ధనముండును. వస్త్ర, ధన, ధాన్య లాభములు. పై అధికారుల దర్శనము, ఇష్టకార్య సిద్ధి. శుక్రుడు అష్టమ స్థానగతుడగుటచే గొప్ప సౌఖ్యము, బంధు మిత్రులతో కలయిక.

అక్టోబరు:జన్మరాశి నుండి ఉపచయమగు 6వ స్థానమున రాహువు స్థితిచే ధైర్యము, స్వల్ప అనారోగ్యము, చర్మవ్యాధులు, గతనెల ఫలితముతో బాటు అధికార యోగము కొనసాగును. ఐశ్వర్య వృద్ధి యగును. హుషారుగా యుండును.

నవంబరు: సర్వత్రా కార్యసిద్ధి, ముఖవర్చస్సు, ఆయుర్ వృద్ధి, ఆరోగ్యము, నూతన విషయాలను శోధించుట, విద్వతి జనులతో గోష్ఠి, సమాజంలో గుర్తింపు, లాభస్థానమందలి కుజ సంచారంచే కార్యానుకూలత, ధైర్యము, ధన, కనక, వస్తు, వాహన సౌఖ్యం.

డిశెంబరు: పుష్కలమగు కీర్తియూ. ఇష్టకార్య సిద్ధి, అర్ధలాభము, క్షీరాన్నభోజనములు. రాజ్యస్థానమందు రవి సంచారము వలన ద్రవ్యలాభము, ఎల్లప్పుడూ ఆరోగ్యము, బంధుమిత్ర సమాగమము. తన గొప్పతనమును ఇతరులు కీర్తించవలెనని తపన.

జనవరి: లాభస్థానమందు రవి సంచారము సర్వత్రా శుభదాయకం. సకలైశ్వర్యములు, ఆర్ధిక అభివృద్ధి. పెట్టుబడులు మంచి ఆదాయమును, ఫలితములను ఇచ్చును. ఆర్ధిక విషయములు ప్రోత్సాహకరం. ఆకస్మిక ధనలాభం, శుభకార్యా మూలక ధనవ్యయం.

ఫిబ్రవరి: ఇంటి యందు ఎల్లప్పుడూ ఉత్సవము, పెండ్లి మొదలగు శుభకార్య నిర్వహణ, మధుర పదార్థ భక్షణ. జన్మరాశి యందు ఉచ్చస్థుడగు శుక్రుడు ఎల్లప్పుడూ ఆనందము, నూతన వస్తు వస్త్రాభరణములు ధరించుట, పదిమందిలో గౌరవమును పొందుట.

మార్చి: అకాల భోజనము, బంధు మిత్రులతో భేదాభిప్రాయములు. జన్మరాశి యందు రవి, బుధ, శుక్ర మూడు గ్రహముల సంచారము వలన ఈ కాలమున అధికార యోగ్యతలు, కంఠము బిగ్గరగా చేసి మాటలాడుట, అవసరము లేనిచోట అధికముగా ప్రసంగించుట, పెద్దలను విడచి ప్రవాసము చేయుటయూ జరుగును.